పిలుపు - Bhavuka friday
“ఇవాళ లంచ్ కి ఎప్పుడు రావాలో టైమ్ చెప్తామని అన్నారు. ఇంకా అంజూ ఫోన్ రాలేదు. ఏమైంది చెప్మా!” నేను అప్పటికి ఏ పదోసారో వాట్స్ అప్ చూసుకుంటూ అలా అనుకోవడం.
”అప్పుడే ఒంటిగంటన్నర… పక్క బిల్డింగే కదా … పోనీ ఒకసారి వెళ్ళి చూసి వస్తే… “ ఆలోచనలో ఉండగానే, ‘టింగు..టింగు’ మంటూ మొబైల్ చేస్తున్న శబ్దాలను విని, దిగ్గున లేచాను సోఫా నుండి. “ఈ పిలుపు నాకోసమే” కూనిరాగం తీస్తూ మొబైల్ చూసాను.
‘మా ఆయన బంగారం’ గ్రూప్ లో, మొగుళ్ళతో ఉన్న ఫోటోలు పెడుతున్నారు మా సఖీలు.
దానికి సూపర్… ఆసమ్ … చించేసావ్ … అంటూ రకరకాల ఎమోజీలు…
వాటిని చూసేటప్పటికి ముందు ఒళ్ళు మండింది. తర్వాత కడుపులో మండింది. పొద్దున్న ఎప్పుడో తిన్న మూడు ఇడ్లీలు…అరగిపోయి చాలా సేపు అయింది.
వీళ్ళందరి వరుసా చూస్తుంటే, నన్ను లంచ్ కి పిలిచామనే సంగతే మర్చిపోయినట్టున్నారు. నేను వ్రాసి, డైరెక్ట్ చేసిన నాటకానికి గురు దక్షణ అంటూ కబుర్లు చెప్పారు. ఇవాళ లంచ్ కి కలుద్దాం. మీరేమి చెయ్యదు. మేమే అన్నీ చేస్తామని, మెనూ కూడా ఇచ్చేసారు. మెనూ చదివి లొట్టలు వేసీ వేసీ బుగ్గలు నొప్పెట్టయి కానీ రమ్మని పిలుపు మాత్రం రాలేదు.
అప్పుడు అంజూ ఫోన్ వచ్చింది.
“వెరీ సారీ ఆంటీ ! మంజు, సునీతలు ఇవాళ వీలు కాదంటే, మన లంచ్ ప్రోగ్రాం కాన్సల్ చేసాము. మంజూ మీకు సునీత చెప్తుంది అనుకుంటే. సునీతేమో మంజు చెప్తుందని అనుకుంది. ఇలా ఒకరు చెప్తారని ఇంకొకరు అనుకుని, ఎవరూ మీకు చెప్పలేదని ఇప్పుడే తెలిసింది. నేనూ వేరే పార్టీలో ఉన్నాను. ఇంట్లో లేను. వెరీ సారీ .. చిన్న కమ్యూనికేషన్ గాప్ … అంతే ఏమనుకోకండి. ఈ వీకెండ్ కి తప్పకుండా కలుద్దాం.“ ఫోన్ పెట్టేసింది.
అప్పుడే శ్రీవారి ఫోన్ “మీ పార్టీ బాగా అయిందనుకుంటా. బాగా ఎంజాయ్ చేశారా “ అంటూ.
“అదేమిటబ్బా…ఆ సామెతా ... సమయానికి అసలు గుర్తుకు రావడం లేదు. .. “ కోపంతో పళ్ళు నూరుకున్నాను.
------- సమాప్తం--------
No comments:
Post a Comment