Tuesday, August 9, 2022

ప్రయాణంలోపదనిసలు

మన భావాలూ - మన కథలు 23-03-2022



#ప్రయాణంలోపదనిసలు


ఇది 1993 సంగతి. ఇన్నేళ్ళైనా మర్చిపోలేని సంఘటన. 


మా చిన్న తమ్ముడి పెళ్ళి కని ముంబై నుండి హైదరాబాద్ బయలు దేరాము. 

అప్పుడు ముంబై వి.టి నుండి హైదరాబాద్ ఎక్సప్రెస్ లో మధ్యాన్నం 12. 20 కి బయలుదేరితే, మర్నాడు పొద్దున్నే హైద్రాబాద్ లో దిగిపోయేవాళ్ళము. 


మావారు ఆఫీస్ నుండి డైరెక్ట్ గా వి.టి స్టేషన్ కి వస్తాననడంతో, మా అత్తగారు, అప్పటికే ఆవిడకి దాదాపు 70 ఏళ్ళు, మా పెద్దమ్మాయి ఐదేళ్ళది, చిన్నదానికి  మూడు నెలలు , వీళ్ళని తీసుకుని వి.టి స్టేషన్ చేరుకున్నాను . 


ఇండికేటర్ చూస్తే 8 వ నెంబర్ లా కనిపించింది.  కూలీని మాటాడుకుని, మా అత్తగారిని, పిల్లలని సామాన్లని తీసుకుని  ఆ ఫ్లాట్ ఫారం మీద  కూర్చున్నాను. 


  దాదాపు 12 గంటలైంది, అసలు జనం జాడే లేదు. మొత్తం ఫ్లాట్ ఫారం మీద మేమే  ఉన్నాము. అంతా చాలా ఖాళీగా ఉంది. చిన్నగా నాలో ఆందోళన మొదలైంది. ఒకవేళ ట్రైన్ గాని కాన్సల్ అయిందా.. అయితే అనౌన్స్మెంట్ రావాలి  కదా !


మా వారి జాడ కూడా లేదు.  

కంగారు పడుతూ  మాటాడుకుంటున్న మా మాటలని,మమ్మల్ని చూసి,  అక్కడే పని చేసుకుంటున్న ఒక రైల్వే కూలీ మా దగ్గరకి వచ్చి,  ‘హైదరాబాద్  ట్రైన్ ఇవాళ పదమూడో నెంబర్ మీద వస్తోంది. గబగబా వెళ్ళండి . పదిహేను నిముషాలు మాత్రమే ఉంది.” అన్నాడు. 

 

నేను చేసిన మంచి పని ఏమిటంటే  టిక్కట్లు నా దగ్గరే ఉంచుకోవడము.  ఒకవేళ ఏ కారణం చేతైనా, శ్రీవారు రాకపోయినా మేము  హైదరాబాద్ వెళ్ళేటట్లు ముందే డిసైడ్ చేసుకున్నాము. . 


అప్పటి వరకు రాని మా వారి మీద విపరీతమైన కోపం వచ్చింది. ఈ పిల్లలని , అత్తగారిని, సామాన్లని వేసుకుని వెళ్ళాలంటే … నా గుండె జారిపోయింది. ఈ రెండింటి ఫ్లాట్ ఫారమ్ ల మధ్య ఇంచుమించు కిలోమీటరు కి పైగానే దూరం ఉంటుంది. ఆ తరువాత కంపార్ట్మెంట్ వరకు వెళ్ళాలి. అందులో ఈ పదమూడో నెంబర్ ఫ్లాట్ ఫారం చాలా పెద్దది కూడా !


నా ముఖం చూసిన ఆ కూలీ “అమ్మా! కంగారు పడకు. పెద్దమ్మని, పిల్లని, సామాన్లని నేను ట్రాలీలో తీసుకెళతాను. నువ్వు చంటిపిల్లని ఎత్తుకుని నెమ్మదిగా రా .. . బోగి నెంబర్ ఏవిటీ ?” అన్నాడు. 


“ఎస్. నైన్ “ అని చెప్పాను. అతని సహాయం తీసుకోక తప్పదు మరి. 

అప్పుడు ఇంకా మొబైల్స్ వాడకంలో  లేవు. ఏ విధంగానూ మా వారిని కాంటాక్ట్ చేయలేని పరిస్థితి. 


మొత్తానికి ఆ రైల్వే కూలీ తెచ్చిన సామాన్ల ట్రాలీ మీద అత్తగారిని, పెద్దమ్మాయిని సామాన్లతో సహా ఎక్కించి, ‘నాన్నగారు కనబడతారేమో చూస్తూ ఉండు.” అని దానికి చెప్పాను. 


అతను ముందు వెళుతుంటే, నేను చంటి దాన్ని ఎత్తుకుని,  భుజం మీద నుండి జారిపోతున్న హ్యాండ్ బాగ్ ని సర్దుకుంటూ,   దాదాపు పరిగెడుతున్నట్లు నడుస్తున్నాను.  ఆయాసం వచ్చేస్తోంది. 


“ఇతనికి కనీసం వంద అయినా ఇవ్వాలేమో .. . అనుకున్నట్లుగా ట్రైన్ లో పడిపోతే చాలు.  డబ్బు దేముంది ? అసలు ట్రైన్ అందుకోగలనా లేదా… అందుకోలేకపోతే , వాళ్ళిద్దరి దగ్గర టిక్కెట్లు లేవు, ఖర్మకాలి  టిసి పట్టుకుంటే, డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేవు.”  క్షణ క్షణానికి నాకు టెన్షన్ పెరిగిపోతోంది.


అంత వరకు నా ముందే ట్రాలీని తోస్తూ నడుస్తున్న అతను, సడెన్ గా కనిపించడం మానేసాడు. 


“బాబోయ్ … ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు వీళ్ళని? అత్తగారి వంటి మీద రెండు పేటల  గొలుసు, ఒక్కో చేతికి రెండేసి  బంగారం గాజులు ఉన్నాయి. ఒకవేళ నా కన్ను గప్పి, వీళ్ళని పక్కకి మళ్లించేసాడా ? అత్తగారికి తెలుగు తప్ప మరో భాష రాదు. అసలు ముక్కు ముఖం తెలియని అతనిని నమ్మి, ఇద్దరినీ ఎలా పంపించేసాను? ఈ ట్రైన్ కాకపోతే రాత్రి ట్రైన్ కి వెళ్లి ఉండేవాళ్ళం.  ఛీ .. ఛీ … అసలు ఆలోచించకుండా చేశానే ….” నన్ను నేనే తిట్టుకున్నాను  అతను కనిపించక పోయేటప్పటికీ భయం పట్టుకుంది.  అన్నీ నెగిటివ్ ఆలోచనలే 

నా వశంలో లేకుండా గాలిపటం లా అటూ ఇటూ ఊగుతున్నాయి. 


 మొత్తానికి పదమూడో నెంబర్ మీద ఉన్న ‘హైదరాబాద్ ఎక్సప్రెస్’ పేరు చూసిన తర్వాత ప్రాణం కుదుట పడింది. 


అక్కడ ఉన్న గడియారం లో 12. 16 చూపిస్తోంది. 


నా కాళ్ళల్లో మిగిలి ఉన్న శక్తిని కూడ గట్టుకుని, ఎస్. నైన్ బోగి ని వెతుకుతున్నాను. 


“పద్మా ! మెల్లిగా రా .  పాపని ఇయ్యి. అమ్మా వాళ్ళు ట్రైన్ లో కూర్చున్నారు “ అంటూ మా వారు ఎదురొచ్చారు. 


అప్పుడు సరిగ్గా 12. 20 చూపిస్తోంది రైల్వే గడియారం. 


పాపని మా వారికి అందిచ్చి,’ ఎక్కండి తొందరగా.. మళ్ళీ ట్రైన్ కదలిపోతుంది.” అన్నాను. 


“నీ కోసం ఇవాళ ఈ ట్రైన్ ని ఆపేసాను” అన్నారు మా వారు గొప్పగా .  


అదే క్షణంలో “ 7031 ముంబై హైదరాబాద్ ఎక్సప్రెస్ ఈ రోజు పదమూడో నెంబర్ ఫ్లాట్ ఫారం నుండి 12. 30 నిముషములకు బయలుదేరును “ అన్న రైల్వే వారి ప్రకటన వినపడింది. 


నాకోసం ఆదుర్దాగా చూస్తున్న మా అత్తగారు, “ఆ అబ్బాయి చాలా మంచివాడిలా ఉన్నాడు. వీడు డబ్బులిస్తున్నా , తీసుకోకుండా దండం పెట్టి వెళ్ళిపోయాడు” అన్నారు. 


నేను ఎప్పుడు నమ్మే ఆ రాఘవేంద్రుడే ఈ రూపంలో వచ్చి సహాయం చేసాడని అనిపించింది. 

అతనినే తలచుకుంటూ మనసులోనే నమస్కారం చేశాను. 


మన ఆలోచనలు ఎంత చంచలమైనవో కదా.. ఒక నిముషంలో నమ్మకం… మరు నిముషంలో అనుమానం…  

ఎవరి గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా, వారి గురించి అంచనా వేయకూడదని తెలుసుకున్నాను ఆ సంఘటనతో. 



No comments:

Post a Comment