పర్యావరణ హిత పర్యాటకం - మాథెరాన్'
ఈసారి క్రిసమస్ సెలవల్లో మరి దూరంగా కాకుండా ముంబైకి దగ్గరగా ఉన్న 'మాథెరాన్'
హిల్ స్టేషన్ కి వెళదామని
నిశ్చయించుకున్నాము. మేము నవి ముంబై లో ఉన్న
సీబీడీ బేలాపూర్ అని ముంబై పూనా రహదారి మీద ఉన్న చిన్న (township ) నివాస ప్రదేశంలో ఉంటున్నాము. అనుకోవడం ఏమిటి చకచకా
హోటల్ రిజర్వేషన్స్ చేసేసుకున్నాము.
ముంబై లాంటి కాంక్రీట్ అరణ్యం నుంచి, హడావిడి పరుగులెత్తే జీవితం నుంచి, ఒక్క రెండు మూడు రోజులు తప్పించుకోవాలని అనుకుంటే, మాథెరాన్ సరైన ప్రదేశం.
'మాథెరాన్' పశ్చిమ కనుమల పర్వత శ్రేణుల్లో, మహారాష్ట్రలో రాయగఢ్ జిల్లాలో కర్జత్ తాలూకాలో ముంబై మహా
నగరానికి దగ్గరగా ఉన్న చిన్న హిల్ స్టేషన్. మన దేశంలో ఉన్న అతి చిన్న హిల్ స్టేషన్ కూడా ఇదే. ప్రపంచం లో ఉన్న అతి కొద్ది 'పర్యావరణ హిత', పర్యాటక ప్రదేశం. అక్కడకి ఎలాంటి మోటార్ వాహనాల్ని అనుమతించరు. అందువల్ల మాథెరాన్ మిగిలిన హిల్ స్టేషన్స్ కన్నా ఎంతో భిన్నమైనది.
మాథెరాన్ చేరాలంటే
మూడు అంచెలుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మాథెరాన్ సముద్రమట్టం
నుంచి సుమారు 2625 అడుగుల ఎత్తు కొండ మీద ఉంది.
ముందుగా కొండ కింద ఉన్న 'నేరల్'
అనే ప్రదేశానికి వెళ్ళాలి. రెండవ అంచె మరి కొన్ని కిలోమీటర్లు కొండ పైకి 'దస్తూరి
నాకా ' అనే మరో ప్రదేశానికి
వెళ్ళాలి.ఆఖరిగా మూడవ అంచె - కొండపైకి
అంటే మాథెరాన్,
చేరాలంటే మూడు విధాలుగా వెళ్ళచ్చు. నడక,గుర్రపు స్వారీ, చేతి రిక్షా.
ఆరోజు పోదున్నే బాగా అల్పాహారం చేసి కారులో బయలుదేరాము. గూగుల్ మ్యాప్స్ ప్రకారం దగ్గర దగ్గర 62
కి.మీ చూపిస్తోంది. మాథెరాన్ కొండ కింద ఉన్న నేరల్ జంక్షన్ కి చేరడానికి 90 నిముషాలు పట్టింది .
'ఈ నేరల్
జంక్షన్ కి ముంబై నుంచి,
పూనా నుంచి
నుంచి రోడ్, రైల్
మార్గాలతోబాగా కనెక్టివిటీ ఉంది. పూనా నుంచి
కొంచం దూరం ఎక్కువ. టాక్సీలు రావచ్చు.. మనం స్వంతంగా డ్రైవ్ చేసుకుంటే,
'దస్తూరి నాకా' లో ఉన్న
కారు పార్కింగ్ వరకు వెళ్ళచ్చు. పార్కింగ్ రుసుము కడితే,
మనం వచ్చే వరకు మన కారుని
అక్కడ ఉంచవచ్చు.ఈ పాయింట్ వరకే మోటారు వాహనాలను అనుమతిస్తారు. ఇంక వేటినీ వదలరు ఒక్క అంబులెన్సుని తప్ప.
ఇక్కడనుంచి మాథెరాన్ మార్కెట్ వరకు కాలి నడకన,
ఒక గంటలో కొండ అందాలన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చు. ఇదివరకు
నేరల్ రైల్వే స్టేషన్ నుండి మాథెరాన్ 'అమన్
లాడ్జి' వరకు 'టాయ్
ట్రైన్' (నేరో
గేజ్) నడిపే వారుట. గాని, గత సంవత్సరం రెండు
సార్లు పట్టాలు తప్పడం వల్ల ప్రజల భద్రత
కోసం ఈ ట్రైన్ సర్వీసెస్ రద్దు చేసారు. ఇంకా
మొదలు పెట్టలేదు . ఈ ప్రత్యేక టాయ్ ట్రైన్ ని ‘పూల్ రాణి’ అని
పిలుస్తారు.
వర్షాకాలం అయితే వర్ణించడాని మాటలే ఉండవు.అంత అందమైనదీ
మాథెరాన్. అసలు మాథెరాన్ కి అర్ధం ఏమిటంటే, మరాఠీ. లో 'మాథె'అంటే నుదురు','రాన్'
అంటే అడవి అని అర్ధం . రెండు కలిపి '
మాథెరాన్ '? మన శరీరంలో నుదురు
ఎత్తుగా ఉంటుంది కదా అలాగే ఎత్తుగా ఉన్న అడవి - మాథెరాన్ అనే పేరు వచ్చిందేమో ... మరి మన తెలుగులో 'తల కోన'
అనుకోవచ్చా
మేము నెరల్ జంక్షన్ దగ్గర మా సామాను తీసుకోని, అక్కడ
షేర్ టాక్సీలో 'దస్తూరి
నాకా' వరకు వెళ్ళాము. ఈ నేరల్ జంక్షన్ నుండి దస్తూరి నాకా వరకు ,అక్కడ
స్థానిక టాక్సీ యూనియన్ షేర్ టాక్సీ లని నడిపిస్తోంది. స్థానికులకు జీవనోపాధి
కల్పించాలని, ప్రైవేట్ టాక్సీలని
అనుమతించటం లేదు. మాథెరాన్ మునిసిపల్ కౌన్సిల్ పర్యాటకుల నుంచి ప్రవేశ రుసుము
వసూలు చేస్తోంది. పెద్దవాళ్ళకి 25
/-, పిల్లలకి 10 /-రూపాయిలు
. నిర్వహణ ఖర్చులకోసం , మాథెరాన్ అభివృద్ధి
కోసం ఈ నిధిని ఉపయోగిస్తారుట . అక్కడ మన సామాను మొయ్యడానికి కూలీలు దొరుకుతారు.
అలాగే మోటార్ వాహనాలు లేకపోవడం వల్ల, అనేక
రిక్షాలు, గుర్రాలు ఉన్నాయి.
చిన్న గేట్ దాటి ముందుకి వెళ్ళగానే ఎర్ర మట్టి దారి కనిపించింది. పర్యావరణ కాలుష్య రహిత
వాతావరణం. రైల్
పట్టాల మీద వెళితే గంటలోనే వెళ్ళచ్చు అని విని ఉండడం వల్ల, మేము
నడచి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాము
లెక్కలేనన్ని కోతులు... మనల్ని వెంబడిస్తుంటాయి. మన చేతిలో
ఉన్న సంచిలో తినే వస్తువులుంటే వెంటనే పసిగట్టి, లాగేస్తాయ్.
చాల టైమింగ్ …అంచనా..వారేవా
..మన పూర్వికులు వీళ్ళేగా...మా
స్నేహితుల సలహా మేరకు చేతిలో ఏవి
ఉంచుకోలేదు నీళ్ల సీసా తప్ప. పక్షుల కూతలు, కోతుల కిచకిచలు, మనుషుల పకపకలు,గాలిలో తేలి వచ్చే
సంభాషణలు తప్ప మరొక శబ్దం లేదు. ఆరోజు
కొంచం వేడిగా ఉన్న, దట్టమైన చెట్ల నీడన చల్లగా ఉంది. థానే కలెక్టర్ శ్రీ Hugh
Poyntz Malet 1850 లో కనుక్కున్నారుట మాథెరాన్. ఈ మాథెరాన్ హిల్
స్టేషన్ గా అభివృద్ధి చెందాలని అప్పటి ముంబై గవర్నర్ లార్డ్ ఎలిఫిన్ స్టోన్ పునాది
వేసారుట. రెండు అడుగుల నేరో గేజ్ కొండరైల్ మార్గం నెరల్ నుండి 1907 లో సామాన్యులకు అందుబాటు లోకి వచ్చి, రాకపోకలు
మొదలైయ్యాయి .
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మాథెరాన్ ని 'ecosensitive ' ప్రాంతంగా
ప్రకటించింది . అన్నిటినీ
చూసుకుంటూ, కోతుల
బారినుండి తప్పించుకొంటూ, రైల్వే పట్టాల మీద నడవడం మరుపురాని అనుభూతి. కొండ మీద నుంచి నెరల్
పట్టణాన్ని, కర్జత్
పట్టణాన్ని చూసాము. ఆగిఆగి ఫోటోలు తీసుకుంటూ గంటన్నర తరువాత మాథెరాన్ మార్కెట్
చేరుకున్నాము.
అప్పటికీ ఒంటి గంట
కావస్తోంది. మేము ముందుగా రిజర్వు చేసుకున్న హోటల్ అక్కడనుండి మరో పదిహేను నిముషాల
దూరం. ఆ మధ్యలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి, స్కూల్ ,
మాథెరాన్ రైల్వే స్టేషన్ చూసాము. మార్కెట్ లో చాల చిక్కి
అమ్మే దుకాణాలని చూసాము. ఇక్కడ వాళ్ళకి మరాఠీ, హిందీ,
ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు. మాథెరాన్ సీజన్ తో సంబంధం లేదు
ఎప్పుడైనా రావచ్చు. ప్రకృతి పరిపూర్ణ అందాలు చూడాలంటే మాత్రం వర్షాకాలం బెస్ట్. అక్కడ
వాళ్ళకి టూరిజమ్ మీదే రాబడి. కింద నుంచి వచ్చిన సవారీలు దాదాపు అన్ని మార్కెట్ లో
ఆగిపోతాయి. అక్కడనుంచి మరొకటి చేసుకోవాల్సి ఉంటుంది . వస్తుంటే చాలా పార్శి
వాళ్ల బంగళాలని గమనించాము. బ్రిటిష్ వారు హిల్ స్టేషన్ గా మాథెరాన్ ని మార్చడం
వల్ల, బ్రిటిష్ స్టైల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది ఇక్కడ. ఊరంతా ఎర్రటి దుమ్ము. .గుర్రాల అరి పాదాలు తారు రోడ్డు వేడికి తట్టుకోలేవు.
వాటికీ మట్టి రోడ్డె మంచిది. అందుకే మాథెరాన్ లో అన్ని మట్టి రోడ్లే.
పాండే రోడ్డులో ఉన్న మా రిసార్ట్ కి వెళ్లి, కొద్దీ
సేపు సేదతీరి, మాథెరాన్
అందాలు చూడడానికి బయలు దేరాము.
ముందుగా మా రిసార్ట్ కి దగ్గరగా ఉన్న ప్రదేశాలు చూద్దామని
నడక మొదలు పెట్టాము. రాంబాగ్ పాయింట్ కి దగ్గరగా ఉంది 'హోలీ క్రాస్ చర్చి'.1860 లో కాథలిక్ కార్మికులు నిర్మించిన అతి పురాతనమైన
చర్చి. లోపలికి వెళితే చాల ప్రశాంతంగా
మనసుకి అనిపించింది.నిర్దిష్ఠ సమయంలో అన్ని మతాలవారు వెళ్ళచ్చు. అక్కడున్న caretaker ని
అడిగితె చర్చి కి గురించి అన్ని వివరాలు
తెలుపుతాడు. అక్కడ నుండి రాంబాగ్ కి నడిచాము. మెయిన్ మార్కెట్ నుండి సుమారు రెండు
కి.మీ. ఉండచ్చు. మా రిసార్ట్ కి చాల దగ్గర. మెయిన్ రోడ్డు నుంచి కొంచం పక్కగా
చిన్న చిన్న రాళ్లతో,
మెట్లతో ఉంటుంది దారంతా. గుర్రాలు అప్పుడప్పుడు
కనిపిస్తుంటాయి. వీధి దీపాలు చాల తక్కువ. సూర్యోదయం చూడాలంటే ఆ దారిలో చేతిలో
టార్చ్ ఉంచుకొంటే మంచిది. మర్నాడు ఉదయాన్నే రావాలని నిశ్చయించుకుని వెనక్కి
వచ్చేసాము. ముందే చూసి రావడం వల్ల, మర్నాడు ఆరు గంటలకల్లా
చేతిలో టార్చ్ తో ,
రాళ్ళని, గుర్రాలని తప్పించుకొంటూ రాంబాగ్ పాయింట్ కి చేరుకున్నాము.
చాల నిశ్శబ్దం గా ఉన్నా,
సూర్యోదయం చూడాలని
వచ్చిన యాత్రికులతో శబ్దాలు గుసగుసలుగా అనిపించాయి.
అత్యద్భుతం ..అమోఘం
అరుణోదయం ... కొండల వెనక నుండి ముందు మెల్లిగా , తరువాత
చాల గబగబా పైకి వచ్చాడు. సూర్యుడు. ఎంత చూసినా తనివి
తీరదు. ఆకాశం నుదుటున పెట్టుకున్న ఎర్రటి
బొట్టులా ఉన్నాడు సూర్యుడు. సరిగ్గా
అప్పుడు 'ముత్యాలముగ్గు'లో రావుగోపాలరావు డైలాగులు గుర్తుకు వచ్చాయి. ముళ్ళపూడి వారిని జ్ఞాపకం చేసుకున్నాను. బాగా
పైకి వచ్చేంతవరకు ఉన్నాము.
తిరిగి మా రిసార్ట్ కి వచ్చే దారిలో, 1916 లో
గూల్రాజ్ సింఘాని గారు కట్టిన 'అంటువ్యాధుల వార్డ్' కొంచం
శిధిలావస్థలో ఉన్న కట్టడాన్ని చూసాము. ఆ రోజుల్లో బహుశా వ్యాధి సోకిన వాళ్ళని దూరంగా
ఉంచేవారన్నమాట.
దండిగా అల్పాహారాన్ని చేసి, మాథెరాన్ అందాలని
చూడడానికి బయలుదేరాము.దాదాపు 38 పిక్నిక్
స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రోజు
మొదటగా మాథెరాన్ కి,
పరిసరాలకి,
తాగే నీరు సరఫరా చేసే 'చార్లెట్
లేక్' దగ్గరకి
వెళ్ళాము. చిన్నదైనా చాల శుభ్రంగా , పారదర్శకంగా ఉన్న ఈ
కొలనులో చేపలు పట్టడం,
బట్టలు ఉతకడం లాంటివి అనుమతించరు. చిన్న డామ్ కట్టడం
వల్ల వర్ష కాలంలో పైనుండి వచ్చే చిన్న
జలపాతం ద్వారా ఈ కొలనులో నీళ్లు ఎప్పుడు ఉంటాయి.
ఈ లేక్ కి కుడివైపు అతి పురాతనమైన 'పిసర్నాధ్
మందిర్' వుంది.
ఇందులో శివుడు స్వయంభువుడు.
పిసర్నాధ్ గ్రామదేవతగా స్థానికులచే పూజింపబడుతున్నాడు. ఇక్కడ ప్రత్యేకత
ఏమిటంటే ఇక్కడ శివుడు లింగాకారుడైన, 'L ' ఆకారములో
సింధూరంతో పూర్తి గ కప్పబడి ఉంటాడు.
సముద్ర మట్టం నుంచి దాదాపు 2516 అడుగుల ఎత్తులో కట్టబడింది
మందిరం. సూర్యాస్తమయం లోపల దర్శనము
చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ మందిరము దట్టమైన అడవి మధ్యలో ఉంది.
ఈ మందిరాన్ని ఇటుకలతోను, అక్కడ దొరికిన కలప తోనూ, పై కప్పు టిన్ రేకుతోను కట్టారు. రెండు అంతరాలుగా ఉన్నది
ఈ గుడి. , గర్భగుడి తలుపులు భారీ
మందపాటి కలపతో నిర్మించారు. అక్కడ ఉన్న మరో అట్రాక్షన్ 'భారీ ఘంట'. అన్ని చూసి, తరువాత 'లార్డ్'పాయింట్ చూడడానికి
బయలుదేరాము. దగ్గరగానే అనిపించింది. పైకెక్కిన తరువాత అలసట
అంతా మర్చిపోతాము. చాల చాల అందమైన ప్రదేశము. వర్షాకాలం లో వస్తే, ఇంకా బాగుంటుంది. Of course , బురద, జారుడు
తట్టుకోగలిగితే. మా తోబాటు binoculars పట్టుకెళ్ళాము. లేకపోతె అక్కడ ఒక గైడ్
ఉన్నాడు, కొద్దిపాటి డబ్బులు
తీసుకొనే, తన telescope లో అన్ని చూపిస్తున్నాడు.
దూరంగా ప్రబల ఘడ్ కోట - మరాఠాల
శౌర్యానికి, వీరత్వానికి ప్రతీక. మొఘలులని ఓడించి, శివాజీ మహారాజ్
గెలుచుకున్న కోట. విలువైన వస్తువులతోను, వీరులతోను కళకళలాడిన ఆ కోట ప్రస్తుతం శిధిలావస్త లో ఉంది.
అక్కడనుంచి 'శివాజీ నిచ్చెన (ladder) ' చూసాము. మాథెరాన్ లో ఎక్కడనుంచి చూసినా అందమైన ప్రకృతే .
మైమరచి పోతాము. అక్కడ వున్నకొండ దూరం నుండి చూస్తే, ఎవరో లార్డ్ ఆకారం లో
కొండని చెక్కేరేమో అనిపిస్తుంది. కానీ, ప్రకృతి సహజంగా ఏర్పడిన కొండ ఆది. ఈ లార్డ్ పాయింట్ స్పెషలిటీ
ఇదే.
అక్కడ నుంచి ఎకో
పాయింట్ చూడడానికి వెళ్ళాము. పేరులోనే ఉంది దాని ప్రత్యేకత -ఎకో -ప్రతిధ్వని. మనం
ఎలా పిలిస్తే ఆలా ప్రతిధ్వనిస్తుంది. వర్షాకాలం తరువాత వెళితే జలపాతాలు చూసే అవకాశం
ఉంటుంది.
తరువాత వన్ ట్రీ
పాయింట్- ' ఒంటరి చెట్టు' చూడడానికి వెళ్ళాము.
కొన్ని దశాబ్దాలుగా ఒంటరిగా ఉంటోంది ‘జాంబుల్ ట్రీ’- తెలుగులో నేరేడు
చెట్టు. వర్షాకాలం లో కొత్త కొత్త చిన్న చిన్న మొక్కలు వచ్చినా, ఈ చెట్టు మాత్రం ఒక్కటే ఉంటోంది. ఈ ప్రదేశం ప్రత్యేకత
ఏమిటంటే, 1850 లో అప్పటి థానే కలెక్టర్ శ్రీ Hugh
Poyntz Malet మాథెరాన్ వచ్చి ఇక్కడ నుంచి మాథెరాన్ అందాలని చూసి ముగ్ధుడై, మంచి హిల్ స్టేషన్
అవుతుందని బ్రిటిష్ వారికీ తెలియచేసాడుట.అంతే కాదు,
శ్రీ మాల్ట్ గారు కూడా యాదృచ్చికంగా ఈ ‘శివాజీ నిచ్చెన’ ఎక్కి పైకి
వచ్చారని అంటారు. అంతే కాదు ఇక్కడి నుండి శివాజీ మహారాజ్ వేటకోసం మాథెరాన్ హిల్స్
ఎక్కేవాడుట. ఆలాఈ పాయింట్ నుంచి మాథెరాన్ వాలీ వరకు వున్న దారి శివాజీ ladder
గా పాపులర్ అయింది. ఇప్పటికి గిరిజనులు అదే దారి లోలోపల
వున్న మాథెరాన్ అడవులకు వెళ్ళడానికి వాడుతుంటారుట. అడ్వెంచర్ ట్రెక్స్ కి ఈ శివాజీ
ladder పెట్టింది
పేరు. వన్ ట్రీ దగ్గర మొదలైన ట్రెక్క్కింగ్ మాథెరాన్ వాలీ దగ్గర ముగుస్తుంది.
చాల చాల అలసి పోయి మా
రిసార్ట్ కి తిరుగు ముఖం పట్టము. దారిలో
వున్న లిటిల్ చౌక్ పాయింట్, ఖండాల పాయింట్ చూసాము.
కాళ్లు మొరాయించడం తో బుద్ధిగా రిసార్ట్లో వచ్చి పడ్డాము.
మర్నాడు పొద్దున్నే రిసార్ట్ ఖాళీ చేసి తిరుగు
ప్రయాణం ప్రారంభించాము. మాథెరాన్ ఫేమస్ చిక్కీలని,
చాక్లెట్ fudges ని గుర్తుగా తీసుకెళ్ళాము ఈ చిక్కీలని వేరుశెనగ పప్పు తో గాని, నువ్వు పప్పు తో గాని, పుట్నాల పప్పు తో గాని, డ్రై ఫ్రూట్స్ తో
గాని బెల్లం తో కలిపి అచ్చుల్లా చేస్తారు. ముంబై దగ్గర లూనావాలా చిక్కి, ఇక్కడ మాథెరాన్ చిక్కి
బాగా పాపులర్. చిన్నప్పుడు మనం ఉండల్లా చేసుకొని తినేవాళ్ళం ఇక్కడ అచ్చుల్లా
చేస్తారు. ఎనర్జీ బార్లు ఇవి. తక్షణమే శక్తి ఇస్తాయి.
ఈసారి రిక్షా అనుభవం. ముందు ఒకతను, వెనుక ఇద్దరు పట్టుకొని నడిపిస్తారు. మనకి పడిపోతామనే భయం
ఉంటుంది గాని వారు జాగ్రత్తగా తీసుకు వస్తారు. పదిహేను నిమిషాల్లాలో ‘దస్తూరి నాకా’ వచ్చేసాము.
మాథెరానికి బై ...బై
..అనుకుంటూ ..ముంబై మహానగరానికి మా
ప్రయాణం సాగించాము. మాథెరాన్ అనుభూతిని
ఎప్పుడు మరచిపోలేము. మర్చిపోకుండా ఫోటోల రూపంగా
అనేక జ్ఞాపకాలు మాతోనే ఉంటాయి.