Wednesday, January 18, 2012

స్వాగతం నేస్తమా!




స్వాగతం నేస్తమా...
‘మా ఉరంటే నా కిష్టం- మా ఇల్లంటే మరీ-మరీ ఇష్టం’
చిన్నప్పుడెప్పుడో పాడుకున్న పాట. ఇప్పుడు ప్రతి రోజు పాడుకుంటున్నా. మా ఇంటి కిటికీ లో ఉన్న చిన్న పూతోటని చూసుకుంటూ.
ముంబై మహా నగరంలో, సి.బి.డి. బెలాపూర్ అనే ఉపనగరంలో, ఓ బహుళ అంతస్తుల్లో ఉన్న చిన్న ఫ్లాట్ మాది. బహుశా మా బిల్డర్ కూడా నేచర్ ప్రియుడనుకొంటా.. అందుకే మా బిల్డింగ్ ని పచ్చటి కొండల మధ్య కట్టాడు. ప్రకృతికి దగ్గరగా ఉండాలనే కాబోలు, ముందుగానే కుండీలు పట్టేటంత చోటు ఇచ్చాడు. ‘ఫ్లవర్ బెడ్’ అనే పేరుతో. దాన్ని చూస్తూనే మురిసి పోయి, అర్జెంట్ గా శ్రీవారికో అర్జీ పడేసి, కుండీలు పెట్టించేసుకున్నా. అలా మా ఇంట్లో కిటికీ తోట వెలసింది. (పెరడు లేదుగా..)
చిట-పట చినుకులు పడుతూ ఉంటే, నా కిటికీ తోటలో రంగు రంగుల పూలు – తెల్లవి, ఎర్రవీ, నీలంవి, పచ్చవి తొంగి చూశాయి. చుక్క చుక్కలుగా పడే వాన చినుకులు..పచ్చటి ఆకులమీదా, పూల మీద పడి, చల్లటి గాలికీ ఊగుతూ ఉంటే చూడడం నా రోజువారీ అలవాటుగా అయ్యింది.
పూలతో మాట్లాడుతుంటే, ఉన్నట్టుండి ....ఓయ్ ...ఓ కేక..కర్కశంగా .. ఉలిక్కిపడి చూస్తే....ఎదురుగా ఓ చిన్న పిట్ట..మన పిచ్చిక కన్నా చిన్నది. నన్ను పలకరించింది. ఎర్రటి పొడుగాటి ముక్కుతో. గోధుమరంగు పొట్టతో, ఎర్ర పూల చుట్టూ తిరుగుతూ ,పూలలోని తేనె తాగుతోంది. ఎంత వేగంగా రెక్కలని ఊపుతోందంటే, ఝుమ్మనే శబ్దం వినసోంపుగా ఉంది. బాలన్స్ తప్పకుండ, పూల చుట్టూ తిరుగుతూనే ఉంది, పొట్ట నిండే వరకు.
ఫొటో తీద్దామంటే నా కెమెరాకి దొరకదే. సరిగ్గా క్లిక్ చేసే టైమ్ కి తుర్రుమంటుంది. మేం రోజు దాగుడుమూతలు ఆడుకుంటూనే ఉంటాం.
మా పిల్లలు స్కూల్ నుండి రాగానే అడుగుతారు. ఇవ్వాళన్నా షూట్ చేశావాని ? ( బాబోయ్, తప్పుగా అనుకోకండి..) ఫోటో తీశావా అని అర్ధం. మొత్తానికి మా చిన్నమ్మయ్ తీసిన ఫొటో ఇది.
దాని తరువాత ఓ నల్లటి మైనా వస్తుంది. దానికి ‘చపాతీ’ అంటే ఇష్టం. అన్నం తినదు. దాని కోసం చిన్న బుట్ట కిటికీ చట్రానికి కట్టాను. రోజు ఠంచన్ గా వచ్చే మరో నేస్తం కాకి. అది సరిగ్గా ఉదయం 9 గం. అయ్యే సరికి వంటింటి కిటికీలో నుల్చుని పిలుస్తుంది నే వచ్చాను సుమా! అని. పాపం, అది చాలా మంచిది. ఏది పెట్టినా తింటుంది. Selective కాదు.
ఇడ్లీ,దోసె, అన్నం , బ్రెడ్, చపాతీ ఏదైనా సరే... అక్కడే ఉంటుంది కాని లోపలికి రాదు.
అప్పుడప్పుడు వచ్చే అతిధి నేస్తాలు – పిచ్చికలు, రామచిలకలు ఉన్నాయ్. ఎండైన, వానైనా, చలైన ఎప్పుడు ఊః ..ఊ..అంటూ హడావిడి చేసే పావురాల సంగతి సరే సరి. శక్తి కొద్ది రెట్టలు వేసి, నా సహనాన్ని పరిక్షిస్తూ ఉంటాయి. వాటికి అసలు మర్యాద తెలియదు. రై. రై .. మని లోపలికి దూసుకు వచ్చేస్తాయి. చాలా పెంకివి. కుండిల్లో గుడ్లు పెడతాయి. తీసి పారేద్దమంటే సెంటిమెంట్ అడ్డు వస్తుంది.
మొన్నటికి మొన్న, వినాయక చవితి నాడు వినాయకుడికి ఎర్ర పూలంటే ఇష్టమని నా కిటికీ తోట లోంచి ఎర్ర పూలు కోశాను. (నీకు చెప్పాడా ? శ్రీవారి ఆరా!) ఆ.. అలాంటివి నేనసలు పట్టించుకొను. ఎర్ర పూలతో తృప్తిగా పూజ చేశాను.
వేళ కాని వేళ, ఆ ఎర్రటి, పొడుగాటి, చిన్న పిట్ట, లోపలికి వచ్చి, చాలా సీరియస్ గా కీ...కీ...అని నా వైపే చూస్తూ అరిచింది. అన్నా.. నీ దేముడి కోసం, నాకు తిండి లేకుండా చేశావా? అని అడుగుతున్నట్లుగా అనిపించింది.
కప్పు నిండా బాగా పండిన దానిమ్మ గింజలు తెచ్చి దాని ముందు వేశాను. కాలితో తన్ని తుర్రుమంది.
కింద పడిన గింజల్ని పావురాలు క్షణంలో తినేశాయి. వాటికి సిగ్గు లేదు.
మరో మూడు సార్లు ఆ ఎర్ర పిట్ట నాతో దాని భాషలో తిట్టేసి వెళిపోయింది. అయ్యో, దానికి తిండి లేకుండా చేసానే అని బాధపడ్డాను.
మర్నాడు మళ్ళీ మామూలే.... ఎర్ర పిట్ట .. వచ్చి పలకరించే వరకు నా మనసు కుదుట పడలేదు.
స్వాగతం నేస్తమా! ఇద్దరం స్నేహితులైపోయము.